మన చరిత్రని మనమే మర్చిపోతున్న తరుణంలో యువ దర్శకులు ఇలాంటి చారిత్రాత్మిక అంశాలతో, ఇప్పటి టెక్నాలజీని ఉపయోగించి చిత్రాలని నిర్మించి ఒక ఆదర్శమైన మార్గాన్ని మనకి చూపిస్తున్నారు. అలాంటి కోవకే చెందినది “మిరాయ్” చిత్రం. తేజ సజ్జ, మంచు మనోజ్, రితిక నాయక్, శ్రీయా శరన్, జగపతి బాబు, జయరాం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సగర్వంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని. ఈరోజు ఈ చిత్రం టీజర్ విడుదల అయ్యి అందరి మెప్పుని పొందే క్రమంగా అడుగులు వేస్తోంది.

ఇది ఒక చారిత్రాత్మిక కదాంశం. అశోక చత్రవర్తికి సంబందించిన తొమ్మిది పుస్తకాలు, యుగాల కిందట సృష్టించబడిన ఒక ఆయుధం, వాటిని కాపాడాల్సిన కర్తవ్యం ఈ చిత్రం సారాంశం. ప్రతీ ఫ్రేమ్ లో కొత్తదనాన్ని చూపించారు. గ్రాఫిక్స్ కూడా చాలా అద్భుతంగా, ఎలాంటి తప్పులకు తావులేకుండా తయారుచేసారు. ప్రతీ పాత్రకి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది అనిపించేలా టీజర్ ని కట్ చేసారు చిత్ర బృందం. ఈ కథ అశోక చక్రవర్తికి సంబంధించింది అని ముందే మన అందరికి దర్శకుడు కార్తీక్ చెప్పటం జరిగింది. కథని, దానివెనుక ఉన్న కారణాన్ని నమ్మి ఇంతపెద్ద ప్రాజెక్ట్ ని టి.జి. విశ్వ ప్రసాద్ గారు ముందుకి తీసుకువెళుతున్నారు. పెట్టిన ప్రతీ పైసాకి న్యాయం జరిగింది అనిపించింది.

ముఖ్య తారాగణం తేజ సజ్జ ఒక యోధుడిగా తన నటనతో ఒక మెట్టు ఎక్కారు. ప్రతినాయకుడిగా మంచు మనోజ్ గారు తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించటానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా ఎనిమిది సంవత్సరాల తరువాత ఆయన వెండితెరమీద దర్శనం ఇవ్వబోతున్నారు. ముఖ్య పాత్రల్లో నటించిన జయరాం గారు, జగపతి బాబు గారు, శ్రీయా, రితిక తమవంతు బాధ్యతని నిర్వర్తించారు. ఈ చిత్రానికి మణిబాబు కరణం అందించిన మాటలు మంచి ఆదరని అందుకుంటాయి. దర్శకుడు కార్తీక్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫీ చేసారు. గౌర హరి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది, నిధి ప్రియా గారి ఆర్ట్ వర్క్ కూడా అబ్బురపరిచేలా ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతోంది. ఈ చిత్రానికి ఈ బృందం పెట్టిన కృషికి తగిన ఫలితం వస్తుంది అని ఆశిద్దాం.






