విడుదల తేదీ: జనవరి 1, 2025
చిత్రం: “మార్కో”
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: “The war between love and trust beyond the ages.”
నటీనటులు: ఉన్నీ ముకుందన్, యుక్తి తరేజా, కబీర్ దుహాన్, సిద్దిఖ్, జగదీష్ తదితరులు.
ఎడిటర్: షమీర్ మొహమ్మద్
మ్యూజిక్ డైరెక్టర్: రవి బాస్రుర్
సినిమాటోగ్రఫీ: చంద్రు సెల్వరాజ్
నిర్మాత: షరీఫ్ మొహమ్మెద్ CIG
రచన-దర్శకత్వం: హనీఫ్ అదేని
తెలుగులో జనతా గ్యారేజ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు అయిన ఉన్నీ ముకుందన్ నుంచి ఒక చిత్రం వస్తోంది అంటే ఎంతో కొంత ఆసక్తి చూపించే ప్రయత్నం చేస్తారు తెలుగు యువత. ఆ ఒక్క చిత్రం తోనే కాకుండా మాలికాపురం అనే చిత్రం ద్వారా కూడా ఆయన తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. అలాంటి ఒక నటుడి నుంచి ఇంత భయంకరమైన చిత్రం ఎవ్వరూ ఊహించి ఉండరు. అదే “మార్కో”. మలయాళం, హిందీ లో క్రిస్మస్ సందర్భంగా విడుదల అయిన చిత్రం ఈరోజు తెలుగులో ప్రేక్షకులని పలకరించింది. ఇప్పటికే మలయాళంలో అద్భుతమైన వసూళ్ళని రాబడుతున్న ఈ చిత్రం తెలుగు రివ్యూ ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:
విక్టర్ D.పీటర్ (ఇషాన్ షౌకత్) ఒక కళ్లులేని వాడు. స్వతహాగా పెర్ఫ్యూమ్ ఆర్టిస్ట్. అనుమానాస్పద రీతిలో రస్సెల్ (అభిమన్యు స్ తిలకం) చేతులో చంపబడతాడు. విక్టర్ అన్న మార్కో (ఉన్నీ ముకుందన్) తన కుటుంబానికి ఇచ్చిన మాట వలన ఇటలీ లో జీవనం సాగిస్తూ ఉంటాడు. తమ్ముడి మరణ వార్త తెలిసి ఇండియా వస్తాడు. వచ్చిరాగానే చంపినవాళ్ళని కనిపెడతాను, వాళ్ళని చంపుతాను అని ప్రమాణం చేస్తాడు. రావటంతోనే ఈ హత్యకి బాధ్యులు ఎవరన్నది కనిపెట్టే ప్రయత్నంలో చాలా సమస్యలు ఎదురుకుంటాడు. ఎంతో మందిని ఎదిరించవలసి వస్తుంది. అసల విక్టర్ ని ఎందుకు చంపారు? రస్సెల్ ఎవరు? రస్సెల్ కుటుంబానికి మార్కో కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి? మార్కో తన తమ్ముడి చావుకి పగ తీర్చుకున్నాడా ? ఇవన్నీ తెలుసుకోవాలంటే మార్కో చూడాల్సిందే.

కథనం:
విక్టర్ నుంచే కథ మొదలవుతుంది. తన చావుతో ఒక రెండు పెద్ద గోల్డ్ బిజినెస్ చేసే రౌడీ ఫామిలీస్ లో కలకలం మొదలవుతుంది. మార్కో ఎవరికి చెప్పకుండా ఇండియా వచ్చేస్తాడు. ఎవరు చెప్పిన వినకుండా పగతో తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో దొరికిన వాళ్ళని దొరికినట్టు కొడుతూ చంపుతూ వెళ్తూ ఉంటాడు. చాలా భయంకరమైన రక్త తర్పణాలు ఉన్నాయి ఈ సినిమాలో. ఎవరైతే యాక్షన్ మూవీస్ ఇష్టపడేవాళ్లు ఉన్నారో వాళ్ళకి బాగా నచుతుంది ఈ చిత్రం. ఒక భయంకరమైన పోరాట సన్నివేశంతో ఇంటర్వెల్ పడుతుంది. ఇంటర్వెల్ దెగ్గరే సినిమా అయిపోతుంది అనిపిస్తుంది. కానీ ఎవరూ ఊహించని ఒక ట్విస్ట్ తో కొనసాగుతుంది.

ఇంటర్వెల్ తరువాత వచ్చే అన్నీ సన్నివేశాలు రక్తమయంగానే ఉంటాయి. ఒక్కొకళ్ళని నరుక్కుంటూ వెళ్ళటం, చిత్ర విచిత్రంగా చంపే ప్లాన్స్ వెయ్యటం, ఎముకలు విరిగిపోవటం, పేలిపోయి శరీరం ముక్కలు ముక్కలు అవ్వటం. ఇలాంటివి కోకోల్లలుగా ఉన్నాయి ఈ చిత్రంలో. మధ్యమధ్యలో కుటుంబ ప్రేమలు, భాందవ్యాలు, ఆప్యాయతలు కనిపిస్తాయి. కానీ అవి ఏమాత్రం నిలబడవు. ఒక అతి భయంకరమైన ప్రీ-క్లైమాక్స్ పోరాటంతో ఒకరకమైన వైరాగ్యంలోకి వెళ్ళాక, అంతకుమించి క్లైమాక్స్ పోరాటం ఉంటుంది. శత్రుసంహారం చేస్తాడు మార్కో.

విశ్లేషణ:
పోరాటాలు తప్ప ఒక బలమైన కథ, కథన, కారణం కనిపించవు ఈ చిత్రంలో. కుటుంబ భాంధవ్యాల గురించి ప్రస్తావన వస్తుంది, కానీ అది చూపించే క్రమంలో గాడి తప్పేశారు దర్శకులు. రస్సెల్ కుటుంబానికి, మార్కో కుటుంబం మీద ఉన్న పగకి సంబంధించిన కారణం అసలు అర్థం లేనిది అనిపిస్తుంది. అసలు గొడవ మొదలుపెట్టటం దేనికి, భయపడటం దేనికి అనిపిస్తుంది. సినిమాలో మార్కో చేసింది మూడే పనులు, సిగరేట్ తాగటం, కొట్టటం, నరికి చంపేయటం. పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది, లొకేషన్స్ నచ్చుతాయి. ఇది ఒక రెండు కుటుంబాలకి సంబంధించిన గొడవ అని ముందుగానే తెలిసిపోతుంది.
నటీనటుల పెర్ఫార్మన్స్:
మొత్తం చిత్రం మీద హీరో ఉన్నీ ముకుందన్, తనకి అన్నగా నటించిన సిద్దిఖ్ గారు బాగా నటించారు. రస్సెల్ గా నటించిన అభిమన్యు గారికి మంచి స్క్రీన్ టైం ఉంది. చివర్లో ఒక విల్లన్ గా ఎంట్రీ ఇచ్చిన కబీర్ దుహాన్ తన వంతు పాత్ర మంచిగానే పోషించారు. మిగిలిన ఏ ఒక్క యాక్టర్ కి నటించాల్సిన అవసరం పెద్దగా రాలేదు. పోరాటాలతోనే మొత్తం సమయం అంతా సరిపోతుంది. వీళ్ళ నలుగురు మాత్రం వాళ్ళ వంతు బాధ్యతని మంచిగా పోషించారు.

సాంకేతిక విభాగం:
పోరాట సన్నివేశాలు చిత్రికరించిన దర్శకుడిని మెచ్చుకోవాలి. సినిమాలో దాదాపుగా ఒక అయిదు నిముషాల సింగల్ షాట్ పోరాట సన్నివేశం ఉంటుంది. అది చాలా బాగా తెరకెక్కించారు. అలాంటి పోరాట సన్నివేశాన్ని తెరకెక్కించిన సినిమాటోగ్రఫర్ ని కూడా చాలా మెచ్చుకోవాలి. ప్రతీ ఫ్రేములో నిర్మాణ విలువలు బాగా కనిపిస్తున్నాయి. చిత్రంలోని పోరాట సన్నివేశాలు చూసాక దర్శకుడు హనీఫ్ కి ఎవరిమీద అయినా పగ ఉందేమో అనిపిస్తుంది. రవి బాస్రుర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుంటుంది.







