రివ్యూ బై: సాయిరాం తాడేపల్లి
విడుదల తేదీ: మార్చ్ 6, 2026
చిత్రం: “మెన్షన్ హౌస్ మల్లేష్”
రేటింగ్: 3.5/5
బాటమ్ లైన్: “స్వచ్ఛమైన ప్రేమ ముందు ఎలాంటి సమస్య అయినా అడ్డంకి కాదు… అది కేవలం పరీక్ష మాత్రమే “
నటీనటులు : శ్రీనాధ్ మాగంటి, గాయత్రి రమణ, కామాక్షి భాస్కర్ల, మురళీధర్ గౌడ్, రాజేష్ కుమార్, సాయి ప్రసన్న తదితరులు
దర్శకుడు : బాల సతీష్
నిర్మాత : రాజేష్ కుమార్
సంగీత దర్శకుడు : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్ : అమ్మముత్తు. కే
ఎడిటర్ : గారీ బి హెచ్

శ్రీనాథ్ మాగంటి కథానాయకుడిగా బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మెన్షన్ హౌస్ మల్లేష్”. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మించిన ఈ చిత్రంలో గాయత్రి రమణ కథానాయికగా నటించారు. మార్చ్ 6వ తేదీన విడుదల అయిన ఈ చిత్రం ఒక కొత్తరకమైన అంశంతో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. ఇప్పటి జనరేషన్ పిల్లలకి, పెద్దలకి సంబందించిన ఒక సున్నితమైన అంశాన్ని ఈ చిత్రం ద్వారా మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేసారు బాల సతీష్ గారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చే ప్రతి చిత్రం సినీ అభిమానులని ఆకర్షిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉంది, ఎలాంటి అంశాన్ని ప్రస్తావించారు, కథ, కథనాలను ఈ విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం.
కథ:
మల్లేష్ (శ్రీనాథ్ మాగంటి) ఒక మోటు మనస్తత్వం ఉన్న వ్యక్తి. తన తండ్రి వలన చిన్నతనంలోనే మద్యానికి బానిస అయ్యి, మద్యం మత్తులో తన తండ్రిని కొట్టి ఇంటినుంచి పారిపోతాడు. కొన్నాళ్ళకి తండ్రి కన్నుమూశాడు అని తెలుసుకుని తిరిగి ఇంటికి వస్తాడు. వయసు పెరుగుతున్నకొద్దీ, మోటుతనంతో పాటుగా మద్యం అలవాటు కూడా పెరుగుతూనే ఉంది. పొద్దూకులు మాన్షన్ హౌస్ బ్రాండ్ తాగుతూ, ఊరిలో ఉన్న తన టెంట్ హౌస్ వ్యాపారాన్ని సాగిస్తుంటాడు. ఊరి పెద్ద అయిన చిన్న పటేల్ (రాజేష్) కి కుటుంబ కలహాలు ఉండటం వలన ఎప్పుడూ గొడవలు పడుతూ, ఇంటిమీదకి గొడవలు తెస్తూనే ఉంటాడు మల్లేష్. కొడుకుకి పెళ్లి చేస్తే బాగుపడతాడని అలోచించి తన తల్లి, జ్యోతి (గాయత్రీ రమణ) తో వివాహం చేస్తారు. అప్పటినుంచి అసలైన సమస్య మొదలవుతుంది. మొదటి రాత్రి తన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది అని ఊహించని మల్లేష్, ఆ తరువాత ఏం చేసాడు? తనకి వచ్చిన సమస్య ఏమిటి ? తనకి, చిన్న పటేల్ కి మధ్య జరిగిన ఒప్పందం ఏమిటి ? ఆ ఒప్పందంలో గెలిచాడా, ఓడిపోయాడా ? తెలియాలంటే దెగ్గరలోని థియేటర్లో మెన్షన్ హౌస్ మల్లేష్ చూడాల్సిందే.

కథనం:
యాదగిరి గుట్ట ప్రాంతంలో కథ మొదలవుతుంది. ఒక వర్షం పడిన రాత్రి, చెప్పిన పని సరిగ్గా చెయ్యని కొడుకుని మద్యం మత్తులో కొట్టిన తండ్రి మీద పీకలదాకా కోపం పెంచుకుని, తన తండ్రి గోల వదిలించుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించి, చివరికి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు మల్లేష్. ఒకానొక సమయంలో తిరిగి వచ్చి, మద్యానికి బానిస అయ్యి, టెంట్ హౌస్ వ్యాపారం నడుపుతూ ఉంటాడు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని, అనుకోని విధంగా ఒక సమస్య వలన పెళ్లి చేసుకున్న తన భార్య జ్యోతి (గాయత్రీ) తో ప్రేమలో పడతాడు. తనకి వచ్చిన సమస్యని ఎవరికి తెలియకుండా ఉండేలా చూసుకుంటూ భార్య, స్నేహితుడుగా నటించిన కసిరెడ్డి తో కలిసి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అనుకోని విధంగా ఆ సమస్య ఏమిటనేది చిన్న పటేల్ కి తెలిసి ఆగం ఆగం చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన గొడవలో వాళ్ళిద్దరి మధ్య ఒక సవాలు మొదలవుతుంది. అక్కడితో మొదటి పార్ట్ ముగుస్తుంది.
అసల ఆ సమస్య ఎందుకు వచ్చింది అనే తెలుసుకునే క్రమంలో తన మద్యం అలవాటు వలెనే ఇదంతా అని తెలుసుకుని అది పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అన్నీ సమంగా జరుగుతున్నా సమయంలో తన తల్లి దూరం అవ్వటంతో మళ్ళీ మద్యానికి బానిస అవుతాడు. ఎన్నో సవాళ్ళని ఎదురుకుంటాడు. తనవల్ల తన భార్య కూడా ఎంతో సతమతమవుతూనే ఉంటుంది. కానీ ఒక ఉత్తమమైన ఇల్లాలు చేసే ప్రతీ ఒక్కపని తను చేస్తూ, తన భర్తకి ఉన్న సమస్యని, మందులతో కాకుండా, ప్రేమతో నయం చేస్తుంది. ఎలాంటి అడ్డంకులు కూడా నిజమైన ప్రేమ ముందు, భార్య తోడు ముందు నిలబడలేవని నిరూపించింది. అక్కడితో ఈ చిత్రం సమాప్తం అవుతుంది.

నటీనటులు పెర్ఫార్మన్స్:
భార్యా భర్తలుగా నటించిన శ్రీనాథ్, గాయత్రీ తమ పాత్రలకి అంతులేని న్యాయం చేసారు. వాళ్ళు తప్ప ఆ పాత్రలు ఇంకెవ్వరు చెయ్యలేరు అని నిరూపించారు. ముఖ్యంగా తన భర్తని మార్చుకునే క్రమంలో గాయత్రీ గారి నటన అమోఘం. పెళ్లి సన్నివేశంలో, ముఖ్యంగా మద్యం వదిలేయడానికి చేసే ప్రయత్నంలో వచ్చే సన్నివేశాలలో శ్రీనాథ్ జీవించారు. ఒక నిజమైన పచ్చి తాగుబోతు తన కుటుంబంకోసం, తన కోసం తన అలవాటును మనుకోవటానికి ప్రయత్నించటం అనేది అసాధారణమైన పని. అలాంటి సన్నివేశాలను శ్రీనాథ్ అలవోకగా నటించి మెప్పించారు. ప్రతినాయకుడి పాత్రలో నటించిన చిత్ర నిర్మాత రాజేష్, స్నేహితుడి పాత్రలో నటించిన కసిరెడ్డి, చిన్న పటేల్ భార్యగా ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన కామాక్షి గారు తమ పాత్రలకి న్యాయం చేసారు. తల్లి తండ్రులుగా నటించిన వారి పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. తన తండ్రికి సంభందించిన కథ తెలుసుకున్న తరువాత మల్లేష్ జీవితం మారటం, దాని వెనుకన ఉన్న అసలైన కథ, కారణం చూపించిన విధానం బాగున్నాయి.
సాంకేతిక విలువలు:
ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్న బాల సతీష్ గారి ప్రతిభను మెచ్చుకోవాలి. ఇలాంటి సున్నితమైన, దాంపత్యానికి సంబందించిన చిత్రాన్ని తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించారు. విశేషంగా చెప్పుకోవలసినది సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి గురించి. ఆయన ఇచ్చిన మ్యూజిక్ చాలా ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేయాలకి తగ్గట్టుగా, ప్రాంతీయ నేపథ్యంలో ఒదిగిపోయేలా చాలా అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలు సన్నివేశాలకి తగ్గట్టుగా అర్థవంతంగా ఉన్నాయని చాలా మంది చిత్రం విడుదలకి ముందే చెప్పటం గమనార్హం.
విశ్లేషణ:
దాంపత్యానికి సంబందించిన కథలు ఇదివరకు పదుల సంఖ్యలో వచ్చినప్పటికీ, ఈ చిత్రం ఒక కొత్త విధానంలో, తెరకెక్కబడింది. ఈ చిత్రానికి రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే యువతని ఆకార్చించేలా ఉన్నాయి. దాంపత్యానికి భార్య భర్త మాత్రమే ఉంటే సరిపోదు, వాళ్ళ మధ్య సఖ్యత, అనురాగం, ప్రేమ, ఆప్యాయత ఉండాలని చాటిచెప్పారు దర్శకులు. ఎలాంటి సమస్య అయినప్పటికీ ఉన్నతమైన ప్రేమ , నమ్మకాలతో వాటికీ అలవోకగా దాటివేయొచ్చు అని చెప్పకనే చెప్పారు. ఈ చిత్రంలో కసిరెడ్డి ద్వారా చెయ్యాలని ప్రయత్నించిన కామెడీ చూసినంతసేపు అందరి ముఖాలలో చిరునవ్వు అలానే ఉండిపోయేలా నటించారు. కామాక్షి గారి పాత్రలో ఉన్న బలం చిత్రానికి ఉపయోగపడింది.
బాటమ్ లైన్: ఎలాంటి తారతమ్యాలు, మిశ్రమ ఆలోచనలు లేకుండా కుటుంబంతో చూడదగ్గ చిత్రం “మెన్షన్ హౌస్ మల్లేష్”






