చిత్రం: అంబాజీపేట మ్యారేజి బ్యాండు
విడుదల తేదీ : 02-02-2024
రేటింగ్ : 3/5
బాటమ్ లైన్ : “Perfect Village Revenge Drama” : Unforgettable Movie With Heart Touching Emotions
నటీనటులు : సుహాస్ , శివాని నగరం , గోపరాజు రమణ , శరణ్యా ప్రదీప్ , జగదీశ్ ప్రతాప్ బండారి , స్వర్ణకాంత్ తదితరులు
ఎడిటర్ : కోదాటి పవన్ కళ్యాణ్
సంగీత దర్శకుడు : శేఖర్ చంద్ర
డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ : వాజిద్ బైగ్
నిర్మాత : ధీరజ్ మొగిలినేని , వెంకట్ రెడ్డి
మూవీ బ్యానర్ : G2 పిక్చర్స్ , మహా క్రియేషన్స్ , స్వేచ్ఛ క్రియేషన్స్
డైరెక్టర్ : దుశ్యంత్ కటికనేని

సుహాస్ , శివాని జంటగా నటించిన చిత్రం “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” . గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి దుశ్యంత్ దర్శకత్వం వహించారు, ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి “మహా క్రియేషన్స్, స్వేచ్ఛ క్రియేషన్స్ ” బ్యానర్ల ద్వారా నిర్మించారు. G2 పిక్చర్స్ సంస్థ సమర్పించారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు ట్రైలర్ కి మంచి ఆదరణ లభించింది . సుహాస్ అంటేనే మంచి కథ ఉన్న చిత్రాలు చేసే నటుడిగా ముద్ర వేసుకున్నారు ఆయన . ఈ చిత్రం ట్రైలర్ విడుదల అవ్వగానే ప్రేక్షకులు ఈ చిత్రం మీద మంచి అంచనాలు పెట్టుకున్నారు. వాటిని నిజం చేసేందుకు ఫిబ్రవరి 2వ తేదీన ఈ చిత్రం విడుదల అయ్యింది . ఈ చిత్రం ఎలా ఉంది అనే విషయం, ఎంత వరుకూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది అనే విషయాలు ఈ రివ్యూ లో తెలుసుకుందాం .

కథ : కథ పరంగా మొత్తం 2007వ సంవత్సరంలో జరుగుతుంది. అంబాజీపేట అనే పల్లెటూరులో మల్లికార్జున్ (సుహాస్), పద్మావతి (శరణ్య) అనే కమల అక్క తమ్ముడు నివసిస్తూ ఉంటారు. అదే ఊరిలో మల్లికార్జున్ ఒక మంగలి వాడిగా, ఇంకా ఊరి మ్యారేజ్ బ్యాండ్ లో డప్పు కొట్టే వాడిగా పనిచేస్తూ ఉంటాడు. అక్క పద్మావతి ప్రభుత్వ బడిలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఇద్దరూ తక్కువ జాతికి చెందిన వారు . అనుకోని సంఘటనల నడుమ వెంకట్ (నితిన్ ప్రసన్న) కి మల్లికార్జున్ కి, పద్మావతి విషయంలో గొడవ అవుతుంది. వెంకట్ అగ్ర కులానికి చెందిన వాడు కావటంతో, గొడవ తీవ్రస్థాయికి వెళుతుంది. ఇలాంటి గొడవల మధ్య ఆత్మగౌరవానికి పరీక్ష కాలంగా మారుతుంది. మల్లికార్జున్ తన అక్కమీద పడిన అపార్ధాలను ఎలాగ రూపు మార్పాడు? వెంకట్ మరియు మల్లికార్జున్ శత్రుత్వం ఎక్కడిదాకా దారితీసింది? ఇలాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ :
ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు నిజానికి దెగ్గరగా తీశారు, అలానే చూపించారు. ఈ చిత్రానికి కథ ముఖ్య బలం. పాత్రలను కథనే ముందుకి తీసుకెళుతుంది. ఇలాంటివి మనం ముందే సుహాస్ గారి క్రితం చిత్రాలలో చూసాము. చిత్రాన్ని చూసిన తరువాత మల్లికార్జున, సంజీవ్, పద్మ పాత్రలు మనకి గుర్తుండిపోతాయి. ఒక వ్యక్తి ఆత్మాభిమానం మీద దెబ్బకొడితే ఎలా తిరగబడతారో ఎంతకి తెగిస్తారో డైరెక్టర్ గారు మంచిగా చూపించారు. రివేంజ్ సన్నివేశాలు చిత్రకరణ, చూపించిన విధానం అద్భుతంగా ఉంది. ఊరి ప్రజల జీవితాలను, ఊరిలో ఉండే చిన్న చిన్న సంతోషాలను, గొడవలు దర్శకుడు బాగా చూపించారు. కథ పరంగా కొంచం అలవాటు అయిన అంశం అయినప్పటికీ తీసిన విధానంలో దర్శకులు మన్నలను పొందారు. కొన్ని సన్నివేశాలు చప్పట్లు కొట్టే విధంగా కూడా ఉన్నాయి. మొదటి భాగం లో ఉన్న పట్టుని, రెండొవ భాగంలో కొంచం కొనసాగించి ఉండి ఉంటే ఇంకా వేరే లెవెల్ కి వెళ్ళేది ఈ చిత్రం .

ఫస్ట్ హాఫ్ :
మల్లికార్జున్, తన అక్క పద్మ అంబాజీపేటలో నివసిస్తూ ఉంటారు, ఊరి కథనంతో, పాత్రల పరిచయంతో కథలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసారు దర్శకులు. లక్ష్మీ (శివాని) తో ప్రేమ సన్నివేశాలు, పద్మ గారి సన్నివేశాలు, హీరో వాళ్ళ స్నేహితుడు సంజీవ్ (జగదీశ్) సన్నివేశాలు చాలా ఆకట్టుకున్నాయి. ప్రీ-ఇంటర్వెల్ వరుకూ కథ నార్మల్ గానే సాగుతుంది. కులం పేరిట జరిగే అవమానం, అవమానించే సన్నివేశాలు కథకి ముఖ్యాంశం. ప్రీ-ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరుకూ కథ వేరే లెవెల్ కి వెళుతుంది. ఆ 20 నిమిషాలు చాలా ఆకట్టుకుంటుంది . ఈ మొదటి భాగంలోనే గొడవలతో కథ కొత్త రూపుని దిద్దుకుంటుంది.
సెకండ్ హాఫ్ :
రివేంజ్ కథనంతో మొదలవుతుంది, ఎక్కడా కూడా ప్రతీకారణం ధోరణి పోగట్టకుండా కథ ముందుకి వెళుతుంది. వెంకట్ కి మల్లికార్జున్ కి మధ్య సన్నివేశాలు అలరిస్తాయి. ప్రతీకారం తీర్చుకునే క్రమంలో కలిగే హావభావాలని చాలా గొప్పగా నటించి చూపించారు సుహాస్ గారు, శరణ్య గారు. ప్రీ-క్లైమాక్స్ దెగ్గర పడుతున్నప్పుడు ఉండే చిన్నపాటి ట్విస్ట్ తో క్లైమాక్స్ కి కావలసిన ఊపు వస్తుంది. ఎప్పుడూ చూసిన క్లైమాక్స్ కాకుండా కొత్తగా రాసుకున్నారు దర్శకులు.

మొదటి భాగం కన్నా రెండవ భాగం కొంచం నెమ్మెదిగా వెళుతూ ఉంటుంది. ఎక్కువశాతం ప్రతీకారం తీర్చుకునే సన్నివేశాలని తెరకెక్కించారు. మొదటి భాగంలో కొంతవరకు హాస్య సన్నివేశాలు ఉన్నాయి. ప్రేమ సన్నివేశాలు కొంచెం ఎప్పుడూ చూసే విధంగానే ఉన్నాయి, కానీ నటిగా తొలిపరిచయం అయిన శివాని గారు నటించిన విధానం ఆకట్టుకుంది. స్నేహితుడి పాత్రలో నటించిన జగదీశ్ గారి నటన అందరికీ బాగా నచ్చుతుంది.
నటీనటుల పెర్ఫార్మన్స్ :
ఎప్పటిలానే సుహాస్ తన సహజ నటనతో విశ్వరూపం చూపించారు. పాత్ర కోసం తను ప్రాణం పెట్టి నటించారు . పాత్రకోసం జుట్టు తీసేసే సన్నివేశం, తనకి నటన మీద ఉన్న మమకారాన్ని వ్యక్తపరుస్తుంది. లక్ష్మీ పాత్రలో శివాని గారు మెరిశారు. ప్రేమ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా శరణ్యా గారి నటనని మెచ్చుకోవాలి. సరైన పాత్ర పడితే ఎంత బాగా పాత్రలో ఒదిగిపోయి, దానికి ప్రాణంపోస్తారో నిరూపించారు. ఈ సంవత్సరం ఆవిడ ఎన్ని పాత్రల్లో నటించినప్పటికీ ఈ పద్మ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది అనటంలో అతిశయోక్తి ఏమీ లేదు. వెంకట్ పాత్రలో ప్రతినాయకుడిగా నితిన్ గారు మెచ్చుకోతగ్గ నటనాసామర్ధ్యాన్ని చూపించారు . స్నేహితుడిగా జగదీశ్ పాత్ర, ఆయన అలంరించిన తీరు చాల బాగుంటుంది. పాత్రలు సంఖ్య తక్కువగా ఉన్నాకూడా, వాటికి ఉన్న ప్రాధాన్యత, వాటికి జరిగిన న్యాయం మెచ్చుకోతగ్గ విషయం. పాత్రలని ఎంచుకున్న తీరు బాగుంది అనే చెప్పొచ్చు.

సాంకేతిక విభాగం:
శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఆకట్టుకుంది, పాటలు బాగున్నాయి. సన్నివేశానికి తగ్గట్టుగా అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పవన్ కళ్యాణ్ అందించిన ఎడిటింగ్ కథని, కథనాన్ని ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఉండటానికి దోహత పడింది . వాజిద్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ బాగా నచ్చుతుంది అందరికీ . నిర్మాణ విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దర్శకులు దుశ్యంత్ రాసుకున్న కథ చాలా విలువైన అంశం. దానికి సరిపడా స్క్రీన్ ప్లే మంచిగా రాసుకున్నారు. క్లైమాక్స్ రాసుకున్న విధానం చాలా బాగుంది. కాకపోతే మొదటి భాగంలో కథమీద ఉంచిన పట్టు, రెండొవ భాగానికి వచ్చేటప్పటికి కొంచం సడలింది అనిపిస్తుంది. ప్రతీ పాత్రలోని లోతైన భావోగ్వేగాన్ని వాజిద్ గారు తన కెమెరా ప్రతిభతో మనకి చూపించిన విధానం ప్రశంసనీయం.
రివ్యూ బై : సాయిరాం తాడేపల్లి